కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి మన దేశానికి వచ్చే ప్రయాణికులకు అన్ని ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు నిర్వహించే స్క్రీనింగ్ విధానంలో స్వల్ప మార్పులు చేశారు. చైనా, దక్షిణ కొరియా, దుబాయి, కతార్, ఒమాన్, కువైట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది.
కొత్త విధానంలో స్క్రీనింగ్ చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన సహాయక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీఐఎస్‌ఎఫ్ జవాను నేతృత్వం వహించే ఈ బృందంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు, విమానయాన సంస్థ, ఢిల్లీ పోలీసులకు చెందిన ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు. ఈ బృందం 30 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ చేస్తుంది. ప్రయాణికులు స్క్రీనింగ్‌ను, క్వారంటైన్‌ను తప్పించుకోకుండా ఈ బృందం జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే విదేశాల నుంచి ప్రయాణికులందరికీ మొదట థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని ఆస్పత్రికి, మిగిలిన వారిని ఇమ్మిగ్రేషన్ కౌంటర్లకు పంపిస్తారు.