సైన్యంలో మహిళా అధికారుల పట్ల సాగుతున్న వివక్షను తొలిగిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మహిళా అధికారులకు నాయకత్వ బాధ్యతలు (కమాండ్) అప్పగించాలని స్పష్టంగా చెప్పింది. పదేండ్ల కిందటే హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, అమలు కాకపోవడంతో కేంద్ర ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ పోరాడిన మహిళా అధికారులు అభినందనీయులు. మహిళలు శారీరకంగా బలహీనంగా ఉంటారని, గర్భందాల్చడంతోపాటు, మాతృత్వ, కుటుంబ బాధ్యతలుంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఇది మూస ఆలోచనా విధానమని కొట్టివేసింది. సైనికులు గ్రామీణ ప్రాతం నుంచి వచ్చిన మగవారు ఉంటారని, వారు మహిళ నాయకత్వాన్ని అంగీకరించలేరనే వాదనను కూడా న్యాయస్థానం అంగీకరించలేదు.